ఉద్యమం సంవత్సర బాలుడిగానే జాతీయ పార్టీలైన కాంగ్రెస్, బీ జే పీ లకు దేశ రాజధాని ధిల్లీ లోనే వణుకు పుట్టించిన అరవింద్ కేజ్రీవాల్ తాను సృష్టించిన ‘ఆమ్ ఆద్మీ’ కే భయపడుతున్నాడని మీడియా లో కథనాలు వెల్లువెత్తుతున్నాయి. కాంగ్రెస్, బీ జే పీ లను తన అజెండాను ఒప్పుకొమ్మని అల్టిమేటం జారీ చేయడం ద్వారా అధికారమనే ముళ్ళ కిరీటాన్ని కేజ్రీవాల్ తప్పించుకోవచ్చనుకున్నాడేమో గానీ ఆ ఎత్తు ఎంతో సేపు నిలవలేదు. కేజ్రీవాల్ ప్రభుత్వంలో ఉండి ఆయా నిర్ణయాలు తీసుకోవడాన్ని ఎవరూ ఆపలేరనడం ద్వారా కాంగ్రెస్ మళ్ళీ గొడవను కేజ్రీవాల్ పైకే తెచ్చింది.
ఈ రోజు పార్టీ ముఖ్యుల మీటింగ్ లో కేజ్రీవాల్ ప్రభుత్వం ఏర్పాటు చేసే దిశగా కార్యాచరణ ప్రకటించక తప్పని స్థితిలో ఉన్నారు. ధిల్లీ నలుమూలల్లో 280 మీటింగులు పెట్టి తన భావి గెలుపు, ఓటముల్లో ప్రజలను కూడా భాగం చేయాలనే వ్యూహానికి సరిపోయే సమయం లెఫ్టినెంట్ గవర్నర్ నవాబ్ జంగ్ ఇచ్చేట్లు కనబడటం లేదు.
ఇప్పుడు కేజ్రీవాల్ భయపడుతున్నది తానూ, తన ఎలెక్షన్ వాగ్దానాలకా? అదికారం కోసం పాకులాడుతున్న తన సొంత పార్టీ కొత్త నాయకులకా? తనకు ఓట్లేసి గెలిపించిన ‘ఆమ్ ఆద్మీ’ లకా?
