SPOT LIGHT: Hugo Chavez

Chavez-                                                                           hugo1 

వెన్నుచూపని ధైర్యం. మడమతిప్పని నైజం. సమస్యల్ని తనదైన శైలిలో పరిష్కరించే వ్యక్తిత్వం. అన్నింటికీ మించి అగ్రరాజ్యానికి వణుకు పుట్టించిన ధీరత్వం. చావుకైనా భయపడని తెగువ. ఎవరో తెలుసా… హ్యూగో చావెజ్. జనానికి మేలు చేయడం కోసం ఎంత దూరమైనా వెళ్లొచ్చని నమ్మిన వ్యక్తి. అలాగే జీవితాంతం నడిచిన వ్యక్తి. అందుకే ఆయన జననేతగా జేజేలందుకున్నారు. అలాంటి ధీరుడు కన్నుమూశాడు. వెనిజువేలాను దుఖ:సాగరంలో ముంచి తిరిగిరాని లోకాలకు వెళ్లిపోయాడు. వెనిజువేలానే కాదు లాటిన్ అమెరికానే అనాథగా వదిలేసి వెళ్లిపోయాడు. ముగిసిన హ్యూగో చావెజ్ శకాన్ని మరోసారి గుర్తుచేసే ప్రయత్నమే V6 స్పాట్ లైట్.

che 

కార్ల్ మార్క్స్, మావో, లెనిన్, చే గువేరా, ఫిడెల్ క్యాస్ట్రో… పెట్టుబడిదారీ విధానాన్ని వ్యతిరేకిస్తూ కమ్యూనిస్టు సమాజాల కోసం కృషి చేశారంతా. అందులో కొందరు కమ్యూనిస్ట్ సిద్దాంతానికే వన్నె తెచ్చారు. మరికొందరు సిద్దాంతం కంటే తామే ఎక్కువ గుర్తుండేలా ప్రయత్నించారు, పాలించారు.. కానీ వాళ్లందరి కన్నా వేరుగా, దాదాపుగా పదిహేనేళ్ళు హ్యూగో చావేజ్ పాలన సాగింది. అగ్రరాజ్యం దృష్టిలో ఆయనో నియంత. కానీ వెనిజువేలా, లాటిన్ అమెరికా వ్యూ పాయింట్ లో మాత్రం ఆయన మోడరన్ మావో, మోడరన్ కార్ల్ మార్క్స్. మోడరన్ చేగువేరా. జనం శ్రేయస్సే లక్ష్యంగా, పోరాటమే ఊపిరిగా బతికిన చావెజ్ చివరికి క్యాన్సర్ బారిన పడి కన్నుమూశారు.

2013, మార్చి 5 ఉదయం 4.30 గంటలు. కరాకస్ హాస్పిటల్. వెనిజువేలా. క్యాన్సర్ తో బాధపడుతున్న చావెజ్ చికిత్స పొందుతూ చనిపోయారు. విషయం తెలిసిన వెనిజువేలా గుండె పగిలింది. లాటిన్ అమెరికా తల్లడిల్లింది. టోటల్ గా ప్రపంచం మొత్తం షాక్ కు గురైంది.

సరిగ్గా మూడు నెలల క్రితం హ్యూగో చావెజ్ క్యూబా నుంచి క్యాన్సర్ జయించి తిరిగొచ్చారు. హాస్పిటల్ లో ఉండే నాలుగోసారి అధ్యక్షుడయ్యారు. ఎన్నికల్లో గెలవడంతో పాటు మృత్యువును జయించి వచ్చిన చావెజ్ ను చూసి వెనిజువేలా పులకించింది. ఆ దేశస్తులంతా సల్సా డాన్సులు చేస్తూ ఆయనకు స్వాగతం పలికారు.

అంతలోనే ఘోరం జరిగిపోయింది. పోరాటానికి నిలువెత్తు రూపం నేలకొరగడం చూసి వెనిజులా గుండె పగిలింది. చావెజ్ మరణాన్ని ఆయన వారసుడు నికోలస్ మదురో అధికారికంగా ప్రకటించారు. చావెజ్ ను కాపాడుకునేందుకు చాలా ప్రయత్నించామని… కానీ వీలు కాలేదని మదురో కన్నీటిపర్యంతమయ్యారు.

కానీ పెద్దన్న అమెరికా మాత్రం చావెజ్ మరణంతో సంతోషించే ఉంటుంది. అమెరికా వైపు ఎవ్వరూ కన్నెత్తి చూడకూడదన్నది వాళ్ల  సిద్ధాంతం. ప్రపంచంలో ఏ దేశమైనా సరే… పెద్దన్నకు గులాం అయిపోవాల్సిందే. లేకపోతే సద్దాంని చంపినట్లు వేధించి చంపుతారు. దాడి చేస్తే లాడెన్ లా వేటాడి చంపుతారు. తమ ప్రయోజనాల కోసం ఏం చేసేందుకైనా సై అంటుంది అమెరికా. అలాంటి అగ్రరాజ్యం హ్యూగో చావెజ్ ను కూడా టార్గెట్ చేసింది. చాలాసార్లు లొంగదీసుకునే ప్రయత్నం చేసింది. కానీ అమెరికా బెదిరింపులు చావెజ్ చెవికెక్కలేదు. పైగా వాటిని పూచికపుల్లల్లా తీసేశారు. అందుకే చావెజ్ అంటే పెద్దన్నకంత కోపం. దాన్ని ఎదిరించి నిలబడ్డాడు కాబట్టే… ప్రపంచానికి ఓ గౌరవం. గుర్తింపు.

అమెరికా తుమ్మితే ప్రపంచానికి జలుబు చేస్తుందంటారు. కానీ ఛావెజ్ తుమ్మితే పెద్దన్నకు జలుబు చేస్తుంది. ఈ విషయం అగ్రరాజ్యానికే కాదు ప్రపంచం మొత్తానికి తెలుసు. నాలుగుసార్లు అధ్యక్షుడిగా ఎన్నికయ్యారు. 14 ఏళ్లపాటు అగ్రరాజ్యానికి కంటిమీద కునుకులేకుండా చేశారు. పెద్దన్న స్టైల్లో సామ, దాన, బేధ, దండోపాయాలను ప్రయోగించినా… తొణకలేదు, బెణకలేదు. దటీజ్ చావెజ్. ఇంతకీ హ్యూగో చావేజ్ వెనిజువేలా అధ్యక్షుడిగా ఉన్నంతకాలం ఏం చేశారు ? అగ్రరాజ్యానికి ఆయనెందుకు టార్గెట్ అయ్యారు ?

బలమున్నోడిని ఢీకొంటేనే ఎదుటోడి బలమేంటో ప్రపంచానికి తెలిసేది. హ్యూగో చావెజ్ విషయంలోనూ అదే జరిగింది. దేశంలో ఓ పక్క దరిద్ర్యం తాండవిస్తోంది. మరోవైపు అమెరికా వెనిజువేలాపై పెత్తనం చేస్తోంది. ఆయిల్ రాజకీయాలు చేస్తోంది. దాంతో రగిలిపోయిన హ్యూగో చావెజ్… అందరిలాగే విప్లవాన్ని ఆశ్రయించాడు.

1954 జూలై 28. వెనిజులాలోని సబానెటాలో పుట్టాడు ఛావెజ్. నిజానికి చావెజ్ బేస్ బాల్ ప్లేయర్ కావాలన్న  కోరిక. కానీ స్కూల్, కాలేజ్ డేస్ తో పాటు ఎన్సీసీసీ క్యాడెట్ శిక్షణ అతనిలో మార్పు తెచ్చింది. 1970ల్లో మిలటరీ అకాడమీలో చేరాడు చావెజ్. అప్పటికి అతని వయసు 17 ఏళ్లు. అప్పుడే సైనికులంటే సర్కారుకోసం పనిచేసే ఉద్యోగులన్న అభిప్రాయం ఏర్పడింది. వాళ్లను జనానికి ఎందుకు దగ్గర చేయకూడదన్న డౌట్ తొలిచేసింది. దాంతో పాటు సైనిక వ్యూహం, యుద్ధాల చరిత్ర, క్లాజ్‌విట్జ్‌, బొలీవర్‌, పేజ్‌ సైనిక రచనలు, నెపోలియన్‌, అనిబాల్‌ లాంటి వాళ్ల రచనలు విపరీతంగా చదివిన చావెజ్ దేశంలో సమూల మార్పులు చేయాలని భావించాడు. సైన్యాన్ని పటాలాలకే ఎందుకు పరిమితం చేయాలని. ప్రభుత్వాలను సైన్యం ఎందుకు వెనకేసుకురావాలి ? అధిపత్యాన్ని సైతం సవాలు చేసేలా జనంతో కలిసి ఎందుకు పనిచేయలేమన్న కోణంలో ఆలోచించారు చావెజ్.

మిలటరీ అకాడమీలో విద్యాభ్యాసం చేసిన చావెజ్ ప్రజా క్షేమాన్ని పట్టించుకోని ప్రభుత్వానికి వ్యతిరేకంగా రహస్య గెరిల్లా యుద్ధం చేసాడు. ప్రత్యక్షంగా ప్రభుత్వాన్ని పడగొట్టే ప్రయత్నాలూ చేసాడు. చివరికి రెండేళ్ళు జైలు పాలు కూడా అయ్యాడు. బయటికి రాగానే తనదైన సోషలిస్ట్ పార్టీని స్థాపిచాడు. తర్వాతి రోజుల్లో ఈ పార్టీ యునైటెడ్ సోషలిస్ట్ పార్టీలో కలిసి పోయింది.

1998 మే. వెనిజువేలాలో ఎన్నికలు జరిగాయి. ఎప్పట్లాగే అమెరికా తొత్తులే ఎన్నికల్లో గెలుస్తారనుకుంది ప్రపంచం. కానీ అందరి అంచనాలను తలకిందులు చేస్తూ హ్యూగో చావెజ్ కమ్యూనిస్ట్ జెండాను రెపరెపలాడించాడు. ఆ ఎన్నికల్లో చావెజ్ పార్టీ PSUV ఘనవిజయం సాధించింది. 21వ శతాబ్ధపు సరికొత్త సోషలిజానికి తెరలేచింది.

వెనిజులా ప్రధాన ఆదాయ వనరు ఆయిల్ ఎగుమతులే. 80 శాతం ఆదాయం దాన్నుంచే. ప్రపంచంలో ఐదో అతిపెద్ద ఆయిల్ ఎక్స్ పోర్టర్ వెనిజులా. అమెరికాకు 30 శాతం ఆయిల్ సప్లై చేసేది వెనిజులా. ఐతే ఈ ఆయిల్ అమ్మకం అంతా ముందు చేసుకున్న ఒప్పందాల ప్రకారం చాలా తక్కువ రేటుకు జరిగేది. పైగా మెజార్టీ వాటా ప్రైవేటు వ్యక్తుల చేతుల్లో ఉండేది. దాంతో దేశంలో విపరీతమైన ఆదాయ వనరులున్నా దారిద్ర్యం తాండవించేది. ఎప్పుడూ అశాంతి రగులుతుండేది.

అసలే మావో, ఫిడెల్ క్యాస్ట్రోల స్పూర్తితో ఎదిగిన చావెజ్ కు దేశంలో రాజ్యమేలుతున్న దారిద్ర్యం కసిని రగిలించింది. ప్రపంచంలో అమలవుతున్న అన్ని ఆర్ధిక విధానాలపై అవగాహన పెంచుకున్నాడు. ఆపై తన దేశంలో విధానాల్ని సమూలంగా మార్చేశాడు. వెనిజులాకు కొత్త రాజ్యాంగాన్ని తయారు చేసాడు.
అక్కడితో ఆగలేదు. జనం కష్టాన్ని, ఆదాయాల్ని దోచేస్తున్న మల్టీ నేషనల్ కంపెనీల కుట్రను భగ్నం చేశాడు. వాటిపై నేషనలైజేషన్ అస్త్రాన్ని ప్రయోగించాడు. అధికారంలో ఉన్న పద్నాలుగేళ్లలో వెనెజులాలో 1045 కంపెనీలను జాతీయం చేసి ఆర్థికవ్యవస్థను పరుగులెత్తించారు. అంతేకాదు ఆయన చేపట్టిన భూసంస్కరణలు మంచి ఫలితాలనిచ్చాయి.

ఐక్యతతోనే తమ అస్థిత్వం నిలబడుతుందని, లాటిన్ అమెరికన్ దేశాల కూటమిని ఏర్పాటు చేయడంలో ప్రధాన పాత్ర పోషించాడు చావెజ్. 33 దేశాలను ఏకతాటిపైకి తెచ్చి అమెరికాకు కొరకరాని కొయ్యలా తయారయ్యాడు. ఆయన కృషితో నికరాగ్వా, ఈక్వెడార్, అర్జెంటీనా లాంటి దేశాల్లో అమెరికా వ్యతిరేక కమ్యూనిస్ట్ పార్టీలు అధికారంలోకొచ్చాయి. ఏకంగా తన ఆయిల్ సప్ప్లై పై దెబ్బ పడటంతో అమెరికా షాక్ అయింది. ఏకనుకున్నవాడు మేకై కూర్చోవడంతో అమెరికా ఉక్కిరిబిక్కిరైంది.

అంతర్జాతీయంగా చావెజ్ ను ఏకాకిని చేసేందుకు ఎన్నో ప్రయత్నాలు చేసింది అగ్రరాజ్యం. ఆఖరికి ఖతం చేసేందుకు ఎన్నోసార్లు కుట్ర చేసిందన్న విమర్శలూ మూటగట్టుకుంది. కానీ వెనిజువేలా వాసుల ఆశిస్సులతో పెద్దన్న వ్యూహాలు పనిచేయలేదు. పైగా అవి బెడిసికొట్టి చావెజ్ కీర్తి మరింత పెరిగింది. మూడుసార్లు ప్రజాస్వామ్యయుతంగా ఘనవిజయం సాధించాడు చావెజ్. ప్రతీసారి అమెరికా అతన్ని ఓడించేందుకు రకరకాలుగా ప్రయత్నించింది. కానీ జనం ఎప్పుడూ చావెజ్ నే ఆదరించారు. దాంతో అమెరికా పాచికలు పారలేదు.

అమెరికాను హ్యూగో చావెజ్ ఎప్పుడో జయించాడు. కానీ పెల్విక్ క్యాన్సర్ కు మాత్రం తలవంచాడు. తొడ కండరాల్లో బేస్ బాల్ సైజ్ కణితి. దాన్ని తీసేయించేందుకు క్యాన్సర్ ను వేళ్లతో పెకిలించేందుకు నాలుగుసార్లు ఆపరేషన్ చేయించుకున్నాడు చావెజ్. తన చివరి ఎన్నికల టైంలో క్యూబాలో ట్రీట్ మెంట్ చేయించుకుంటున్నాడు. హాస్పిటల్ బెడ్ పైనుండే ప్రచారం చేశాడు. వెనిజువేలా ప్రజలు పాలు నీళ్లను హంసలా వేరుచేస్తారని ఒకే డైలాగ్ ను సంధించాడు. అది పనిచేసింది. ప్రత్యర్ధి హెన్రిక్ రాడోన్ స్కీ గట్టి పోటీ ఇచ్చినా… అమెరికన్ మీడియా విషప్రచారం చేసినా… చావెజ్ గెలుపును అడ్డుకోలేకపోయారు. పైగా రాడోన్ స్కీ గెలుపే లక్ష్యంగా ఎంతోమంది పెట్టుబడిదారులు రంగంలోకి దిగి కుప్పలుతెప్పలుగా డబ్బులు కుమ్మరించారు. ఒక్కమాటలో చెప్పాలంటే చావెజ్ ఓటమికి అమెరికా ఏం చేయాలో అవన్నీ చేసేసింది. కానీ వెనిజువేలా వాసుల నమ్మకాన్ని మాత్రం వమ్ము చేయలేకపోయింది. కానీ ఆ జనం నమ్మి గెలిపించిన ధీరుడు ఈ లోకంలో లేకుండా పోయాడు.

డిసెంబర్ లో నాలుగోసారి ట్రీట్ మెంట్ తీసుకుంటున్నపుడే చావెజ్ ఓ నిర్ణయానికొచ్చారు. తానిక బతికే అవకాశాలు లేవని, ఉన్నా ఎప్పటికి కోలుకుంటాడో తెలియని స్థితి అని, అందుకే నికోలస్ మదురోను ఉపాధ్యక్షుడిగా… తన వారసుడిగా ప్రకటించాడు.

mad

ఓ శకం ముగిసింది. ఓ ప్రస్థానానికి బ్రేక్ పడింది. ప్రపంచానికే కొత్త వాదాన్ని పరిచయం చేసిన చావెజ్ ను వెనిజువేలానే కాదు ప్రపంచం కూడా అంత ఈజీగా మర్చిపోదు. చావెజ్ ను కోల్పోయిన వెనిజువేలాకు మదురో రూపంలో మరో నిఖార్సైన నేత దొరికినట్టేనా ? పెద్దన్న కుట్రలకు తలొంచకుండా ఎదురు నిలిచే దమ్ము, ధైర్యం మదురోకుందా ? ఈ డౌట్స్ అన్నింటికీ ఆన్సర్ రావాలంటే మరికొన్నేళ్లు వెయిట్ చేయాల్సిందే. ఏదైమైనా ప్రపంచం ఓ దార్శనికుడిని కోల్పోయింది. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని కోరుకుందాం.

Medaram Jathara

Connect with us© 2012 - 2016 VIL Media Pvt Ltd. All rights reserved,
Contents of v6news.tv are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof,
without consent of VIL Media is illegal.Such persons will be prosecuted.